తెలంగాణలో కరోనా వైరస్ కేసులు 50వేలు దాటిపోయాయి. ఇప్పటికే 40వేలకు పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. దాదాపు 11వేల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే తక్కువ లక్షణాలు కలిగిన వారికి, ఎలాంటి ఇతర జబ్బులు లేకుండా ఆరోగ్యవంతులైన యువ తీ యువకులకు కరోనా వైరస్ సోకితే ఇంట్లోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు.
కరోనా వైరస్ చికిత్సలో మరణాల రేటును తగ్గిస్తాయన్న ప్రచారం ఉన్న రెమిడెసివర్ సహా ఇతర మందులు అన్నీ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే హోం ఐసోలేషన్ లో ఉన్న వారి కోసం ప్రభుత్వం కిట్ ఇస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ డి, జ్వరం ట్యాబ్లెట్స్ తో పాటు శానిటైజర్, మాస్కులుంటాయి. అయితే ఈ కిట్స్ ను ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుండి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్న కారణంతో పాటు సరిపడా సిబ్బంది లేకపోవటంతో కిట్స్ పంపిణీపై వారు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉండటంతో అధికారులు బల్ధియాకు ఈ పని అప్పగించగా… జోనల్ కమిషనర్లు డీసీలకు, డీసీలు బిల్ కలెక్టర్లకు కిట్స్ పంపిణీ చేసే పంపిణి అప్పగించారు.
అయినా కూడా దాదాపు 40శాతం మందికి కిట్స్ అందటం లేదన్న ప్రచారం సాగుతుంది. అయితే కిట్స్ పంపిణీ చేయటం లేదా లేక కిట్స్ సరిపడా లేవా…? అన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటన చేస్తే కానీ అసలు నిజం ఏదీ అన్నది తెలుస్తుంది.