జనాల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దందా చేయడం దొంగబాబాలకు ఫ్యాషన్ అయిపోయింది. అతీత శక్తులు ఉన్నాయని రోగాలను పోగడతానని చెబుతూ మోసం చేస్తూనే ఉన్నారు. చివరకు కరోనా మహమ్మారిని కూడా తరిమికొడతానని చెప్పి ఇటీవల హైదరాబాద్‌లో ఓ బాబా పుట్టుకొచ్చాడు. అతని మంత్ర శక్తితో రోగాన్ని నయం చేస్తానని నమ్మించి వేలల్లో గుంజుతూ కుచ్చుటోపి పెట్టాడు. కరోనాకు మందు లేదని తెలిసినా జనం మాత్రం ఆ మాయగాన్ని నమ్మారు. అతడిచ్చేతాయత్తు, విభూది, నిమ్మకాల కోసం ఎగబడి నిలువునా మోసపోయారు. చివరకు పోలీసులు ఎంట్రీతో అతడు కటకటాల పాలయ్యాడు.
మియాపూర్‌లోని హఫీజ్‌పేటలో ఇస్మాయిల్ అనే వ్యక్తి బాబా అవతారం ఎత్తాడు. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకొని తనకు శక్తులు ఉన్నాయని శిష్యులతో ప్రచారం చేయిస్తున్నాడు. రోగి నుంచి రూ.12వేల వరకు వసూలు చేయడం ప్రారంభించారు. తాను వేసే మంత్రంతో మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నమ్మించాడు. తాయత్తు కట్టి చేతిలో నిమ్మకాయ, విభూతి పెడుతూ వచ్చాడు.
మార్చి నెల నుంచి గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి దొంగబాబు కటకటాల్లోకి నెట్టారు. అతడు ఇప్పటి వరకు దాదాపు 70 మందిని మోసం చేశాడని వెల్లడించారు. ఈ సమయంలో కూడా ప్రజలు బాబాలను నమ్మడం ఏంటని అంతా విస్తుపోతున్నారు. కరోనా సోకితే ఆస్పత్రికి వెళ్లాలని ఇలాంటి బురిడీ బాబాల మాయలో పడకూడదని అధికారులు సూచించారు. ఎవరైనా ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.