ప్రైవేటీకరణకన్నా ముందు… తన ఉద్యోగులకు… దేశంలోనే రెండవ అతి పెద్ద ఇంధన రిటైలర్ ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్(భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్)… స్వచ్చంధ పదవీ విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కంపెనీలో పని చేయలేని ఉద్యోగులకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగులకు పంపిన నోటీసులో సంస్థ తెలిపింది.
కాగా… జూలై 23 న ప్రారంభమైన ఈ పథకం… ఆగస్టు 13 వరకు అమల్లో ఉంటుంది. వివిధ కారణాలు, పరిస్థితుల నేపధ్యంలో పనిచేయడానికి ఆసక్తి చూపించని ఉద్యోగులు, అధికారుల కోసం ఈ ‘ఎగ్జిట్ ఆఫర్’ను అమల్లోకి తెచ్చారు.
దాదాపు 5-10 శాతం మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నలభై అయిదేళ్ల వయస్సుకు పైబడిన ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవడానికి అర్హులు. కాగా… బీపీసీఎల్ బాటలోనే త్వరలో మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలు కూడా వీఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా… ఇప్పటికే ఒకసారి వీఆర్ఎస్ పథకాన్ని అమలుచేసిన సంస్థలు కూడా… మరోమారు దీనిని అమలుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.