తెలంగాణలో కరోనా బారినపడిన ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైరస్ సోకగా.. తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
సురేందర్ ఇటీవల జిల్లాలోని రామారెడ్డి మండలంలో కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన మొదలైంది. కాగా కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత తెలంగాణకు చెందిన 20 మందికి పైగా అధికార పార్టీ నేతలు కరనా బారినపడ్డారు. ఇందులో కొందరు మాత్రమే హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మిగిలిన వారంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే కరోనాకు చికిత్స తీసుకున్నారు.