మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయ కుడు, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 21 రోజులపాటు ప్రాణాలతో పోరాడి ఓడిపోయారు. ఆయన మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం ఈనెల 10న ఆస్పత్రిలో చేర్చగా కోవిడ్-19 సోకినట్లు నిర్థారణ అయింది. సర్జనీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. కోమాలోకి జారుకున్న ప్రణబ్‌ను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
కరోనా వైరస్ కారణంగా ప్రణబ్ ముఖర్జీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో ఆయన ఊపిరితిత్తుల పనితీరు మందగించి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ తర్వాత మూత్రపిండాల పనితీరు పైనా ప్రభావం పడింది. డీప్కోమాలోకి వెళ్లిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం ఆయన స్కెప్టిక్ షాక్‌నకు గురైనట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య బందం ప్రణబ్‌కు చికిత్స
అందించింది. ప్రణబ్ మృతి వార్త ఆయన కుటుంబసభ్యులు, అభిమానులను శోకసంద్రంలో ముంచింది. ప్రణబ్ చనిపోయినట్లు ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో ప్రకటించారు. ‘భారమైన హదయంతో నాన్న లేరన్న వార్తను తెలియజేస్తున్నా.. ఆయన ప్రాణాలు నిలపడానికి ఆర్ ఆర్ హాస్పిటల్ వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
‘ప్రణబ్ దా’గా సన్నిహితులు ఆత్మీయంగా పిలుచుకొనే 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరు. యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు పొందారు.
కుటుంబ నేపథ్యం..
పశ్చిమ బెంగాల్‌లోని మిరాటిలో 1935 డిసెంబర్ 11న ప్రణబ్ జన్మించారు. ఆయన తండ్రి కె.కె.ముఖర్జీ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రణబ్ పొలిటికల్ సైన్స్, చరిత్రలో మాస్టర్స్ పట్టాలను పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను సాధించారు. బంగ్లాదేశ్‌కు చెందిన సువ్రా ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ సరీగా ఐదేళ్ల కిందట 2015 ఆగస్టులో కన్నుమూశారు.
సంక్షోభ పరిష్కార ధీశాలి
పార్టీలోనూ, పార్లమెంట్ వ్యవహారాల్లోనూ సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్ అధిష్ఠానానికి ముందు గుర్తొచ్చేది ప్రణబ్ ముఖర్జీనే. రాజీవ్ మరణానంతరం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి.. తుదిశ్వాస వరకు ఆ పదవిలో కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యతను సోనియా గాంధీ.. ప్రణబ్‌కే అప్పగించారు. 1988 మార్చి 14న ప్రణబ్ తన నివాసంలో చాణక్యం ప్రదర్శించి సీతారాం తొలగింపు క్రతువును విజయవంతంగా పూర్తి చేశారు.
అ ఆ తర్వాత ఏడాది సోనియా విదేశీయత అంశాన్ని లేవనెత్తిన శరద్ పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మాలను ఎదుర్కొనే బాధ్యతనూ మళ్లీ ప్రణబ్‌కే అప్పగించారు. ఈ పనినీ సమర్థంగా నిర్వర్తించారు. ఆ సమయంలో సోనియా లేఖలను రూపొందించింది కూడా ప్రణబ్ అనే చెబుతారు.
అ విపక్షాల నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నోసార్లు వారితో మాట్లాడి రాజీకి ఒప్పించిన నేర్పరి. తణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో తలనొప్పులు వచ్చినప్పుడూ ఆయనే మధ్యవర్తి.
వారం రోజులు సంతాపం
రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
”మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంతో ఓ శకం ముగిసిపోయింది. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది. ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనది. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”
– రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
”భారత్రత్న ప్రణబ్ ముఖర్జీ మరణ వార్త విని దేశం మొత్తం విలపిస్తోంది. దేశ అభివద్ధి పథంలో నడిపించడంలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయనో గొప్ప రాజనీతిజ్ఞుడు. అటు రాజకీయ వర్గాల్లోనే కాక, సామాన్యుల నుంచి సైతం మెప్పు పొందిన గొప్ప వ్యక్తి”
– నరేంద్రమోడీ, ప్రధాన మంత్రి
”ప్రణబ్‌జీ మరణవార్తతో దేశం మొత్తం దుఖః సాగరంలో మునిగిపోయింది. యావత్ దేశంతో పాటు నేను కూడా ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా”
– రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
”ప్రణబ్ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. మంత్రివర్గంలో విభిన్న పోర్ట్ పోలియోలతో ఆయన అత్యంత సమర్థ్ధవంతంగా పని చేశారు. సెక్యులర్ భావాల పట్ల నిబద్ధత, చివరివరకూ జాతి సమైక్యత కోసం ఆయన గొప్ప కషి చేశారు”.
– సురవరం సుధాకరరెడ్డి, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి