అపోజిషన్ లోకి వచ్చేశాం… మరి ముఖ్యమంత్రి పీఠం…?

0
192

ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు తిరుగులేదు. గత ఇరవై ఏళ్ల నుంచి ఆయనే ఒడిశాకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బ్రహ్మచారి అయిన నవీన్ పట్నాయక్ కు రాజకీయ వారసత్వం లేదు. ఆయన తర్వాత పార్టీని ఎవరు డీల్ చేస్తారన్నది ఎప్పటికీ ప్రశ్నార్థకమే. నవీన్ పట్నాయక్ కు ఒడిశా రాకపోయినా అందరినీ ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ తర్వాత అంతటి నాయకుడు బిజూ జనతాదళ్ లో లేకపోవడమే ఆ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్నది వాస్తవం.

కాంగ్రెస్ ను బలహీనపరచి…..

అందుకే ఒడిశా విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అక్కడ ఒంటరిగానే బలపడేందుకు తొలి నుంచి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇక్కడ బిజూ జనతాదళ్ తొలి నుంచి బలంగా ఉండటంతో తొలుత అక్కడ రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనే బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ను బలహీన పరిస్తే తాము ప్రతిపక్ష స్థాయికి వస్తామన్న బీజేపీ ఆశలు నెరవేరాయి. ఒడిశాలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారింది.

ప్రత్యేక మిషన్ ను రూపొందించుకుని…..

ఇప్పుడు టార్గెట్ బిజూ జనతాదళ్. 2024 ఎన్నికల్లో ఒడిశాలో తాము అధికారంలోకి రావాలన్నది బీజేపీ యత్నం. అందుకు అనుగుణంగానే బీజేపీ వ్యవహరిస్తుంది. మిషన్ 2024 ను రూపొందించుకుని ఇప్పటి నుంచే పార్టీ నేతలు ముందుకు వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకే ఒడిశా పట్ల ఉదారంగా వ్యవహరిస్తుందంటున్నారు. వరదలు, విపత్తుల సమయంలో ఒడిశాకు భారీగానే కేంద్రం సాయం చేస్తుంది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం. మరో కారణం తాము అధికారంలోకి రావాలని బీజేపీ అనుకోవడం.

టార్గెట్ బిజూ జనతాదళ్…..

వచ్చే ఎన్నికల నాటికి నవీన్ పట్నాయక్ కు 77 ఏళ్లు వస్తాయి. ఆ ఎన్నికలు నవీన్ పట్నాయక్ ఎదుర్కొనడం కొంచెం కష్టమే ఆయన తర్వాత కూడా పార్టీని నడిపే నాయకత్వం లేదు. ఉన్న కొద్ది మంది నేతలను బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. బిజూ జనతాదళ్ లో సీనియర్ నేత జయంత్ పాండాను ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది. మరికొందరు సీనియర్ నేతలను కూడా బీజేపీ చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. మరి నవీన్ పట్నాయక్ ను 2024 ఎన్నికల్లో ఓడించాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరనుందా? లేదా? అన్నది పక్కన పెడితే బీజేపీ మాత్రం ఒడిశాలో సీరియస్ ఎఫెర్ట్స్ పెడుతుందని మాత్రం చెప్పక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here