దుబ్బాకలో ఉపఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి చెందితే హరీష్ రావుని బలిపశువుని చెయ్యడానికి సిద్ధం అవుతున్నారా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. దుబ్బాక ఉపఎన్నిక అనంతరమే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి.. ఫలితాలు వచ్చిన వెంటనే కేటీఆర్కు సీఎం పీఠం అప్పగించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారని సోషల్ మీడియా వేదికగా విజయశాంతి పేర్కొన్నారు.
హరీష్ రావుని దుబ్బాక ఓటమికి కారణం చేస్తే… కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చెయ్యడం తేలిక అవుతుంది అన్నట్టుగా ఉంది కేసీఆర్ ఆలోచన అని విజయశాంతి చెప్పినట్టుగా ఉంది. గతంలో విజయశాంతి కేసీఆర్ చాలా కలం కలిసి పని చేశారు. తెరాస తరపున వారిద్దరే ఎంపీలుగా ఉన్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి పార్లమెంట్లో అలుపెరుగని పోరాటం చేశారు.
అయితే తెలంగాణ సాధనకు తనదైన పాత్ర పోషించి సరిగ్గా తెరాస అధికారంలోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ లో చేరి ప్రతిపక్షంలో ఉండిపోయారు. ఆ ప్రకారం ఆమె ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండిపోయారు. తాజాగా బీజేపీలో చేరనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఏ పార్టీలో ఉన్నా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉండటానికే ఆమె ఇష్టపడటం గమనార్హం.
మరోవైపు… సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా సినిమాలలోకి విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఆ పాత్రతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అయినా మునుముందు తనకు సినిమాలలో నటించే అవకాశం లేదని ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో తేల్చి చెప్పారు.