Home Entertainment బాబుకు ముందున్నవన్నీ మంచిరోజులేనా?

బాబుకు ముందున్నవన్నీ మంచిరోజులేనా?

164
0

చంద్రబాబు రాజకీయ అదృష్టవంతుడు అని చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్ లో యువ నాయకుడిగా ఉండగా హఠాత్తుగా అదే కాంగ్రెస్ రెండుగా చీలిపోవడం ఏంటి, సీనియర్లు అంతా రెడ్డి కాంగ్రెస్ కి జంప్ కావడం ఏంటి, బాబు లాంటి వారికి చంద్రగిరి టికెట్ కోరి మరీ దక్కడం ఏంటి, . ఇక ఆ తరువాత చంద్రబాబు ఉన్న ఇందిరా కాంగ్రెస్ పార్టీయే గెలవడం ఏంటి, జూనియర్ అయినా బాబు ఫస్ట్ చాన్స్ లోనే మంత్రి కావడం ఏంటి, వెండి తెర వేలుపు ఎన్టీయార్ కంటబడి ఇంటి అల్లుడు కావడం ఏంటి, ఆ తరువాత ఎన్టీయార్ బాబు కోసమే అన్నట్లుగా అరవయ్యేళ్ళ వయసులో పార్టీ పెట్టి శాశ్వతంగా బాబుకే దాని హక్కుభుక్తాలు దారాదత్తం చేయడమేంటి. ఇదంతా ఒక్కసారి నెమరువేసుకుంటే ఎక్కడి చంద్రబాబు ఎక్కడిదాకా ఎంతలా ఎదిగాడు అన్నది ఆశ్చర్యం వేస్తుంది.

రికార్డుల బాబు…..

ఇక చంద్రబాబు ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే విపక్ష నేతగా కొనసాగుతున్నారు. దాదాపుగా అర్ధ శతాబ్దకాలం సుదీర్ఘ రాజకీయ అనుభవం బాబు సొంతం. చిన్నవయసులో మంత్రి, చిన్న వయసులో సీఎం. ఇలా ఎన్నో రికార్డులు కూడా బాబునే వరించాయి. ఇవన్నీ చూస్తే సమీప భవిష్యత్తులో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు రికార్డులు కొట్టేవారు ఎవరూ లేరని చెప్పవచ్చు. బాబు వయసు ఏడు పదులు అని అంతా అంటారు కానీ ఆయన ఈ వయసులో కూడా చాలా మంది నాయకుల కంటే బాగా చురుకు. ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే లేవు. ఆయన ఈ విధంగానే కొనసాగితే మరో పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో పరుగులు తీస్తూ తనదైన ముద్రను మరింత బలంగా వేయగలరు అని అంటారు.

అనుభవలేమితో అలా…..

జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఒక మాట వినిపించేది. ఆయనకు వచ్చిన బంపర్ మెజారిటీని కొలిచిన వారు కనీసం మూడు సార్లు కంటిన్యూస్ గా సీఎం ఆయనేనని కూడా లెక్క వేసేశారు. వారూ వీరూ కాదు, కరడు కట్టిన తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, ఆ పార్టీ సామాజికవర్గానికి చెందిన వారు కూడా జగన్ కి ఎదురులేదు అని కోపంగానే అయినా జోస్యం చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ జగన్ తన అనుభవలేమిని అడుగడుగునా చాటుకుంటూ జనాల ఆశలను నీరు కారుస్తున్నాడు అన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఇక జగన్ కి వచ్చిన సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. కొత్త రాష్ట్రం ఏపీని తొందరగా పట్టాలెక్కించడం ఎవరి వల్లా కాదు అని తలపండిన మేధావులు అంటూంటారు. అలాటి ఏపీలో తనదైన ప్రయోగాలు కొత్తవి చేసి జగన్ ఇంకా భారాలు పెంచేసుకున్నాడని అంటున్నారు.

బంగారు పళ్ళెంలోనేనా…?

ఎన్టీయార్ కి రెండు సార్లు కోట్ల విజయభాస్కరరెడ్డి అనే కాంగ్రెస్ పెద్ద ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అధికారాన్ని అప్పగించారు. విజయభాస్కరరెడ్డి సీఎం అయితే తమకు పవర్ గ్యారంటీ అన్న సెంటిమెంట్ కూడా టీడీపీకి అప్పట్లో ఉండేది. ఇపుడు చూస్తూంటే జగన్ కూడా అలాగే బంగారు పళ్ళెం కొత్తగా కొని మరీ చంద్రబాబుకు అధికారం అప్పగిస్తారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. దానికి జగన్ స్వయంగా చేసుకున్న తప్పులు కొన్ని ఉంటే ఆయనకు కలసిరాని రాజకీయం కూడా కారణం అవుతోంది. లేకపోతే జగన్ ఉన్న సమయంలోనే కరోనా రావడం ఏంటి. దేశం మొత్తం కుదేల్ అయిపోవడం ఏంటి. దారుణం కాకపోతేనూ. ఇక పోలవరం విషయంలో కేంద్రం పెడుతున్న పేచీలు జగన్ తలరాతను నిర్ణయించేలా ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేక హోదా లేకపోయినా పోలవరం పూర్తి చేస్తే చాలు 2024లో ఏపీలో జగన్ గెలవడానికి అతి పెద్ద సాధనం అవుతుందని అంతా ఊహించారు. ఇపుడు దానికే ఎసరు పెడుతున్నారు. దాంతో అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు చేతికే అధికార పగ్గాలు వచ్చే ఎన్నికల నాటికి చిక్కుతాయా అన్నది ఓ పెద్ద చర్చగా ఉంది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here