వడ్డించే వాడు మనవాడు అయితే పంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అంటారు. ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. ఒక సామజిక వర్గం వారికే ఎక్కువగా పదవులు కట్టబెడుతున్నారు అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి ఏకంగా క్రికెట్ స్టేడియం ని కేటాయించడం చర్చనీయాంశం అయ్యింది.
కడప జిల్లా పులివెందుల మండలం కేవీ పల్లెలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు 11 ఎకరాలను 30 యేళ్లపాటు లీజుకు కేటాయిస్తారు. ఏడాదికి రూ.2 లక్షల లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు కేబినెట్ ఆమోదించింది. పులివెందులకు ఒక్కటే ఇస్తే బాగోదు అనుకున్నారో ఏమో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకు కూడా ఇంకో స్టేడియం కేటాయించేశారు.
ఆముదాలవలస మండలం జగ్గుశాస్త్రులపేటలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు 7.66 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తారు. ఏడాదికి రూ.2 లక్షలు లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లా కేంద్రాలలో క్రికెట్ స్టేడియంలు లేవు. వాటి కోసం ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. గత ప్రభుత్వంలోనే అటువంటి ప్రతిపాదనలు ఎన్నో ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అయితే కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి వాటినన్నింటిని పక్కకు తోసి పులివెందులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.