మూడు రోజుల ఢిల్లీ పర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో తెరాస, బిజెపిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది.
దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం, జీహెచ్ఎంసి ఎన్నికలలో అనూహ్య ఫలితాలు రావడంతో బీజేపీ తెరాస ప్రభుత్వం పై చాలా కఠినంగా విమర్శలు చేస్తుంది. తెరాస కూడా తాము ఏమీ తక్కువ తినలేదు అన్నట్టు ధీటుగానే సమాధానం చెబుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆకస్మిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మాత్రం ఈ పర్యటనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం ఇటీవలే తెరాస కు జాతీయ రాజధానిలో కార్యాలయం నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని చూడటానికి ఆయన వెళ్తున్నారని అంటున్నారు. అయితే అది అంత నమ్మశక్యంగా లేదు అనే చెప్పుకోవాలి.
బీజేపీ తో సయోధ్య కోసం కేసీఆర్ వెళ్తున్నారని…. తమ పై బీజేపీ అగ్రెస్సివ్ గా వెళ్తే తాము కాంగ్రెస్ ని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుందని… అది బీజేపీ కి అంత మంచిది కాదని కేసీఆర్ ప్రధాని తో చెప్పే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే దానికి తలొగ్గి ఇంతవరకు వచ్చిన తరువాత బీజేపీ వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందా అనేది అనుమానమే.