గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న టాలీవుడ్ సీనియర్ నటి జయంతి ఈరోజు సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 76 ఏళ్లు. జయంతి మృతి పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అందరూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన జయంతి ‘జెనుగూడు’ (1963) అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. కన్నడలో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన జయంతి.. రాజ్ కుమార్ – విష్ణువర్ధన్ – అంబరీష్ వంటి అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించారు. కన్నడ ఇండస్ట్రీ జయంతికి ‘అభినయ శారద’ అనే బిరుదు ప్రధానం చేసింది.
తెలుగులో నందమూరి తారకరామారావు – అక్కినేని నాగేశ్వర రావు – కృష్ణ.. తమిళ్ లో జెమినీ గణేషన్ – ఎంజీ రామచంద్రన్ – రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించారు జయంతి. ‘కొండవీటి సింహం’ ‘జస్టిస్ చౌదరి’ ‘బొబ్బిలి యుద్ధం’ ‘కుమార రాజా’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రల్లో జయంతి నటించారు.