పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. తెలంగాణ మంత్రులు కేటీఅర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ సందర్భంగా వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జై తెలంగాణ.. జై ఆంధ్ర.. జై భారత్.. అనే పదాలతో తన స్పీచ్‌ని మొదలుపెట్టాడు. ఈ వేడుకకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అబిమానులందరికి ధన్యవాదాలు అని తెలిపాడు. చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇమడవని.. ఇది కళాకారులు కలిసే ప్రాంతమని అన్నారు. నిజమైన కళాకారుడికి కులం..మతం..ప్రాంతం అనేది ఉండదని, కులమత ప్రాంతాలకతీతంగా ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఎంతో మంది తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధీకి ఎంతో కృషి చేస్తుందని, ఇందుకుగాను సీఎం కేసీఆర్ గారు అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు అన్నాడు. చిత్ర పరిశ్రమకు ఏ అవసరమున్నా తాను ఉన్నానని ముందుండే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక నాకు జనజీవితంలో ఉన్నా కానీ, సినిమా అన్నం పెట్టిందని, సినిమా ఇచ్చిన బిక్ష ఇంత మంది అభిమానుల గుండెల్లో పెట్టుకునేలా చేసిందని అన్నారు. మనవాళ్ల కోసం ఎంతో కొంత చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను.. కానీ ఏదో అయిపోదామని రాలేదని అన్నారు. ఇప్పటికీ ఎంతో బాధ్యతతోనే సినిమాలు చేస్తున్నానని, తొలి ప్రేమ, ఖుషీ సినిమాలు ఏ బాధ్యతతో చేశామొ, ఈ సినిమాకు అలాగే పనిచేశామని, ప్రతి టెక్నీషియన్ చాలా కష్టపడి పనిచేశారని అన్నారు.
ఇక ఈ చిత్రం ద్వారా మారుమూల ప్రాంత కళాకారులను వెలుగులోకి తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రం అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధం అని.. మళయాళ చిత్రం రీమేక్ అని అన్నారు. ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది తెలుగువారికి అనుగుణంగా తీసుకొచ్చిన త్రివిక్రం గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సినిమాలో నటించిన రానా, సంయుక్త మీనన్, నిత్యామీనన్ అందరూ చాలా బాగా నటించారని, ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా మీ అందరి చేత ఆదరించి, మిమంలని ఆనందింపచేస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.