తెలంగాణ ఫిలించాంబర్ లో టియఫ్ సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన పలువురు కళాకారులను మరియు సినీ ఫొటోగ్రాఫర్స్ కి దాసరి పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి టియస్ ఐఐసి ఛైర్మన్ బాలమల్లు, గజ్జెల నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఐఐసి ఛైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ…“టియఫ్‌సిసి ఆధ్వర్యంలో ప్రతి ఏటా దాసరి జయంతి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని అభినందిస్తున్నా. దాసరి గారు చిన్న చిత్రాలకోసం, సినీ కార్మికుల కోసం ఎంతో పోరాడారు. చిత్ర పరిశ్రమలోని ఎన్నో సమస్యలను పరిష్కరించారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరెన్నో చేయాలని ప్రతాని గారిని కోరుకుంటున్నా. ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ టియఫ్‌సిసి కి ఉంటుందన్నారు.
గజ్జెల నాగేశ్వరరావు మాట్లాడుతూ…“దాసరి గారి జయంతని పురస్కరించుకుని ఈ రోజుని `డైరక్టర్స్ డే`గా ప్రకటించడం గొప్ప విషయం. ఎంతో మందికి ఆదర్శం దాసరిగారు. అలాంటి గొప్ప వ్యక్తి కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతాని గారు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
టియఫ్ సిసి వైస్ ఛైర్మన్ ఎ.గురురాజ్ మాట్లాడుతూ…“దాసరి గారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహా దర్శకుడు. సంపాదించడం కాదు..సంపాదించిన దానిలో పక్క వాడి బాగుకోసం కొంత ఖర్చు పెట్టాలి అని దాసరి గారు చెప్పే వారు. అలాగే చేసేవారు. అలా దాసరి గారి అడుగు జాడల్లో నడుస్తూ టియఫ్ సిసి ద్వారా ఎంతో మందికి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు సాయపడుతున్నారు. కరోనా సమయంలో దాదాపు 20 వేల మందికి నిత్యవసర సరుకులు పంచి ఆయనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. టియఫ్‌సిసి మెంబర్స్ కి కూడా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఏడుగురు వ్యక్తులతో ప్రారంభమైన టియఫ్‌సిసి పదివేల మంది మెంబర్స్ తో కళకళలాడుతుంది. ఈ సంఖ్య 7లక్షలకు చేరాలని మరస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
టియఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“ప్రతి ఏడాది దాసరి గారి జయంతిని పుస్కరించుకుని వేడుకలు చేస్తూ..కొంత మంది కళాకారులకు సన్మానిస్తాం.. అందులో భాగంగా ఈ ఏడాది కూడా 24 క్రాఫ్ట్స్ కి చెందిన పలువురిని సత్కరించాము. అలాగే ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు సముద్ర గారిని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలముల్లు గారికి గజ్జెల నాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఏడుగురుతో ప్రారంభమైన మా టియఫ్ సిసి పదివేల మంది సభ్యులకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి ఆరోగ్య భీమా కార్డ్స్ అందించాం. ఐదు వందల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించాం. కరోనా సమయంలో 20 వేల మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశాం. ఇలా మా తెలంగాణ ఫిలించాంబర్ మా మెంబర్స్ సహకారంతో పాటు మీడియా సహకారంతో ముందుకెళ్తోంది. గతంలో నేను తెలుగు ఫిలించాంబర్ లో మెంబర్ గా ఉన్నానంటే దానికి దాసరి గారి పూర్తి సహకారం వల్లే. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అసలు ఐదు షోలు కావాలన్న ప్రతి పాదన దాసరి గారిదే. ఆయన ఉన్నప్పుడు ప్రతి పాదించింది ఇప్పుడు జీవోగా వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇలా ఎన్నో మంచి పనులు చలన చిత్ర పరిశ్రమకు దాసరిగారు చేశారు. దాసరి గారి లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది “ అన్నారు.
ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ…“మా గురువు గారు దాసరి జయంతిని డైరక్టర్స్ డే గా ప్రకటించడం గొప్ప విషయం. ఆయన జయంతి రోజు ఇలా టియఫ్ సిసీ వారు జయంతి వేడుకలు చేయడం నేను సన్మానించబడటం ఇంకా ఆనందంగా ఉంది. ఈ రోజు ప్రతి కళాకారుడు దాసరి గారిని స్మరించుకుంటాడు. ఆయన తీసిన చిత్రాలు, చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. ఇక తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతాని గారికి ధన్యవాదాలు. టియఫ్‌సిసి దినదినాభివృద్ది చెందుతోంది. ప్రభుత్వం నుంచి కూడా ఎంతో సపోర్ట్ అందుతోంది. నా వంతు కృషి నేను కూడా చేస్తాను “ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జెవిఆర్, కిరణ్, రష్మిక, స్నిగ్ధ, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్య్రక్రమంలో మేకప్ ఉమెన్ జబ, నటుడు వంశీకృష్ణ, యాంకర్ కృష్ణ వేణి, కళ్యాణి నాయుడు, నటి ఆశ, హర్షిణి, లిటిల్ స్టార్ దివ్య, నటి లాస్య తో పాటు సినీ ఫొటో జర్నలిస్ట్ లు భూషన్, సజ్జా వాసు దాసరి స్మారక పురస్కారాలు అందుకున్నారు.