రాజకీయాల్లో పదవులు దక్కడమే గొప్ప. పదవుల కోసం కొన్ని వందల మంది ఎదురు చూస్తున్నా.. అవకాశం దక్కిందంటే.. వారికి వచ్చిన ఛాన్స్‌ను ఎలా వాడుకోవాలి ? ఎలా వ్యవహరించాలి ? ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి ? కానీ, ఆ మంత్రిగారు వీటిని పక్కన పెట్టారు. ఆ ఎవరు ఏం చేస్తారులే..! అనుకున్నారు. ఫలితంగా జగన్ హిట్ లిస్టులో తొలిపేరు నమోదయ్యే స్థాయికి దిగజారారు. ఆయనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రి అనే ప్రచారం జరుగుతోంది. కేవలం గత ఏడాది ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని, టికెట్ దక్కించుకుని గెలుపు గుర్రం ఎక్కిన ఈయన మంత్రిగా కూడా ఛాన్స్ అందుకున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో…..
అసలు సదరు నేతకు మంత్రి పదవి రావడం వెనక చాలా కథ నడిచింది.. అదే సామాజిక వర్గం నుంచి మరో నేత జగన్ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. జగన్ కూడా సదరు నమ్మిన బంటుకే మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రిగా ఉన్న సీనియర్ నేత సామాజిక వర్గంలో కొందరు పెద్దలు అందరూ కలిసి కేంద్ర కేబినెట్లో ఓ కీలక శాఖకు మంత్రిగా ఉన్న తమ సామాజిక వర్గానికే చెందిన నేతతో నేరుగానే జగన్‌కు రికమెండ్ చేయించుకోవడంతో జగన్ చేసేదేం లేక సదరు నేతకు మంత్రి పదవి ఇచ్చారన్నది ఆ సామాజిక వర్గం పెద్దలే చెప్పే మాట.
తన శాఖను పక్కన పెట్టి…..
అయితే, పార్టీలో తనకు ఏ పరిస్థితిలో పదవి దక్కిందో ఊహించుకుని ఆవిధంగా ముందుకు వెళ్లడం మానేశారు. అంతా తానే అన్నట్టుగా పశ్చిమలో చక్రం తిప్పుతున్నారు. పైగా ఎవరినీ ఆయన లెక్క చేయడం లేదు. తన శాఖ కార్యక్రమాలను పక్కన పెట్టి.. పక్క మంత్రి శాఖలో వేలు పెట్టడం రివాజుగా మారింది. ఇలా ఇద్దరు మంత్రుల శాఖల్లో వేలు పెట్టడంతో ఆ ఇద్దరి మంత్రులు కూడా ఆయనపై వీలు చిక్కినప్పుడల్లా రుసరుసలాడుతూనే ఉన్నారు. అంతేకాదు, గ్రూపు రాజకీయాలు చేస్తూ.. ఓ వర్గం నేతలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పశ్చిమలో నాలుగైదు నియోజకవర్గాల్లో ఆయన జోక్యం విపరీతంగా ఉండడంతో ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారు.
వార్నింగ్ ఇచ్చినా మళ్లీ మామూలే…
ఇది రాజకీయంగా ఆయనను కూడా బలోపేతం చేయలేదు. సరికదా.. పార్టీలో ద్వేషాలకు, గ్రుపులకు కూడా ఆజ్యం పోసింది. ఇక, ఇసుక అక్రమాల్లోనూ ఆయన కుమారుడు ఆరితేరిపోయాడనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో సీఎం జగన్ గతంలోనే సదరు మంత్రిని పిలిచి హెచ్చరించారు. `అన్నా.. మీకు ఎందుకు మంత్రి పదవి ఇచ్చానో.. తెలుసా ? అని ప్రశ్నించారు. జాగ్రత్తగా చేసుకోండి“ అని హెచ్చరించారు. దీంతో కొన్ని నెలల పాటు సైలెంట్ అయిన ఆ వృద్ధ మంత్రి.. తర్వాత మళ్లీ మామూలే అనే స్థాయిలో తన సొంత అజెండా అమలు చేస్తున్నారు.
తప్పించాలని డిసైడ్ అయ్యారా?
ఇప్పటికే జగన్ రెండు సార్లు సదరు మంత్రిని పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చినా సదరు మంత్రి మాత్రం ఆయన మాటలే పట్టించుకున్నట్టే లేదు. తన కుమారుడిపై ఆరోపణలు చేసిన వారిని దూషిస్తూ.. కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఆయనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక, ఆయనను తప్పించడమే మంచిదనే అభిప్రాయానికి జగన్ వచ్చారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. జగన్ సదరు మంత్రిని ఎప్పుడైనా నిర్దాక్షిణ్యంగా తప్పించేయవచ్చన్న నిర్ణయానికి కూడా వచ్చారంటున్నారు. ఇక ఆయన్ను తప్పిస్తే అదే వర్గానికి చెందిన జగన్ నమ్మిన బంటుకు కేబినెట్ బెర్త్ కన్ఫార్మే.