Home Local News 10ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం. తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు

10ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం. తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు

178
0
‘తెలంగాణ దళిత బం  ధు పథకం’’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పు కోసం వచ్చే దిశగా దళితులు ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చారిత్రక కృషిలో విద్యావంతులైన దళిత సమాజం కదిలిరావాలని సీఎం పిలుపునిచ్చారు.
దళితుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా దళిత బంధు పథకం అమలు సందర్భంగా మూడు దశలను పాటించాలన్నారు. అందులో భాగంగా దళితుల అసైన్డ్, గ్రామకఠం తదితర భూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని, దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగుపరిచి, దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న తెలంగాణ దళిత బంధు పథకం విజయవంతం కోసం ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా పట్టు పట్టి పని చేయాలన్నారు. తద్వారా తెలంగాణతో పాటు దేశ దళిత సమాజంలో అభివృద్ధి వెలుగులు ప్రసరింప చేసేందుకు దోహదపడాలన్నారు. దళితులను ఆర్థిక వివక్ష నుంచే కాకుండా, సామాజిక వివక్ష నుంచి కూడా దూరం చేసి వారి ఆత్మ గౌరవాన్ని ఎత్తిపట్టేందుకే తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
‘‘తెలంగాణ దళిత బంధు పథకం’’పై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో దళిత సంక్షేమశాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఎమ్మెల్సీలు శ్రీ గోరటి వెంకన్న, శ్రీ ప్రభాకర్, శ్రీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ తాటికొండ రాజయ్య, శ్రీ ఆరూరి రమేశ్, శ్రీ రసమయి బాలకిషన్, శ్రీ గ్యాదరి కిషోర్, శ్రీ చంటి క్రాంతి కిరణ్, శ్రీ సండ్ర వెంకట వీరయ్య, శ్రీ దుర్గం చిన్నయ్య, శ్రీ హన్మంత్ షిండే, శ్రీ సుంకె రవిశంకర్, శ్రీ కె. మాణిక్ రావు, శ్రీ కాలె యాదయ్య, శ్రీ మెతుకు ఆనంద్, శ్రీ జి.సాయన్న, శ్రీ విఎం అబ్రహం, శ్రీ చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, టీఎస్ ఐఐసీ చైర్మన్ శ్రీ గ్యాదరి బాలమల్లు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్, సిపిఎం, సిపిఐ జాతీయ నేతలు శ్రీ వెంకట్, శ్రీ బాల నర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రామకృష్ణా రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేశ్ రంజన్, సీఎం కార్యదర్శులు శ్రీమతి స్మితా సబర్వాల్, శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీ రాజశేఖర్ రెడ్డి, శ్రీమతి ప్రియాంక వర్గీస్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండా శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ. శ్రీ కరుణాకర్, కరీంనగర్ కలెక్టర్ శ్రీ కర్ణన్, మిషన్ భగీరథ ఈఎన్సీ శ్రీ కృపాకర్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
దళిత బంధు ఒక ఉద్యమం
————————-
ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ దళిత బంధు అనేది కేవలం ఒక కార్యక్రమమే కాదు ఇదొక ఉద్యమం. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి వుంటది. అందరూ ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలి. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద వత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ప్రతి విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ వుంటాయి. మనం నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణాన్ని మనం కొనసాగించినప్పుడే విజయం సాధిస్తం.’’ అన్నారు.
ఆర్థిక పటిష్టతతోనే వివక్షకు దూరం
———————————-
‘‘ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించింది. మనిషిపై తోటి మనిషే వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీ ద్వారా నేను కూడా అధ్యయనం చేశాను. మనలో కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోవాలె. పరస్పర విశ్వాసం పెరగాలె. ఒకరికొకరం సహకరించుకోవాలె. దళిత వాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను పోలీస్ స్టేషన్లలో వాపస్ తీసుకోవాలె. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలె. అప్పుడే మన విజయానికి బాటలు పడుతయి. దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరం అవుతారు. ఈ రోజు సదస్సులో పాల్గొన్న వాళ్లంతా, హుజూరాబాద్ లో విజయం సాధించి, ముందురోజుల్లో, తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలె. దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే దళిత జాతి అభివృద్ధి జరుగుతది. దాంతోపాటే తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కూడా దారులు వేస్తది. నైపుణ్యం, ప్రతిభ వున్న దళిత వర్గాన్ని, అంటరానితనం పేరుతో ఊరవతల వుంచి, ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం కూడా దుర్మార్గం. ఇది తెలివి తక్కువ పనే.’’ అని సీఎం అన్నారు.
దళితులకు సర్కారు అండ
—————————
‘‘మనలో పులికి ఉండేంత శక్తి నిబిడీకృతమై వున్నది. ఆ శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. విజయం సాధించాలంటే దళారులు, ప్రతీప శక్తులను దూరం ఉంచాలి. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. సర్కారే స్వయంగా అండగా వున్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి. ప్రభుత్వ వర్గాలతో పని తీసుకునే క్రమంలో ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా వర్గంగా డేగ కన్నుతో పనిచేయాలి. దళిత బంధు పథకం పటిష్ట అమలుకు మమేకమై పనిచేయాలి’’ అని సీఎం అన్నారు.
ప్రభుత్వం లైసెన్సులిచ్చే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు
—————————————————-
ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వుండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం వుండే ఇతర రంగాలను కూడా గుర్తించాలని, వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
పారిశ్రామిక, వ్యాపార, ఉపాధి రంగాల్లో దళితులకు ప్రభుత్వ సాయం పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాటు వేసే వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ళ పెంపకం, టెంట్ హౌజ్, డెయిరీ పరిశ్రమ, ఆయిల్ మిల్లు, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల పరిశ్రమ, హోటల్, స్టీల్ సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, సెల్ ఫోన్ షాప్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నీచర్ షాప్ వంటి పలురకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి, దళిత బంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని సీఎం ప్రకటించారు.
శాశ్వత ప్రాతిపదికన ‘‘దళిత రక్షణ నిధి’’
—————————————————
‘‘దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయానికి అదనంగా, ప్రభుత్వ – లబ్ధిదారుని భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన ‘‘దళిత రక్షణ నిధి’’ని ఏర్పాటు చేస్తం. ఈ నిధిని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్ధిదారుల కమిటీలతో నిర్వహించబడుతుంది. ప్రతీ ఏటా కనీస డబ్బును జమ చేస్తూ, దళిత రక్షణ నిధిని నిరంతరంగా కొనసాగిస్తూ, ఆర్థికంగా మరింత పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా వినియోగించుకుంటాం. ఎవరైతే అవకాశం లేక, సహకారం లేక, బాధపడుతున్నారో, అటువంటి వర్గాలన్నింటికీ దళిత బంధు పథకం దారులు వేస్తది. మీ విజయం, ఇతర కులాలకు, వర్గాలకు, పక్క రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశానికే వెలుతురు ప్రసరింప చేస్తది. దళితులు విజయం సాధించాలి. వెలుగు దివ్వెలు కరదీపికలుగా మారాలి హుజూరాబాద్ గెలుపు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలుస్తుంది. ఆ పట్టుదల మీలో పెరగాలి. మీ దగ్గరినుంచి ప్రసరించే విజయపు వెలుతురు తెలంగాణవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రసరించాలన్నదే నా ఆకాంక్ష.’’ అని సీఎం ఆకాంక్షించారు.
తెలంగాణ దళిత బంధు సదస్సులో దళిత సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ దళిత సమాజం ఆర్థిక సాధికారత కోసం వారి సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రక నిర్ణయం దళిత బంధు పథకం అని అన్నారు. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా పథకం అమలు పర్యవేక్షణను పటిష్టంగా అమలు చేసి పథకాన్ని విజయవంతం చేయడంలో మనసుపెట్టి కృషి చేయాలని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ దళిత బంధు పథకం కోసం సీఎం శ్రీ కేసిఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని దేశానికే ఆదర్శం కాబోతోందన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో పనిచేస్తుందని అన్ని పథకాలను విజయవంతం చేసినట్టే దళిత బంధు పథకాన్ని కూడా విజయవంతం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం సీఎం దృక్పథానికి అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ లో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు విజయం సాధించేలా కృషి చేసి, దేశ దళిత జాతి ఆర్థికాభివృద్ధి కి దారులు వేద్దాం – సీపీఎం నేత శ్రీ వెంకట్
‘‘మేకలనే బలిస్తారు, పులులను కాదు అనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాటలను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, దళితులను పులులుగా మార్చే అవకాశం సీఎం అమలు చేయబోయే దళితబంధు ద్వారా సాధ్యం అవుతుంది. నాకు ఈ విశ్వాసం కలిగినంకనే నేను ఈ మీటింగుకు వచ్చాను.
దళిత బంధు పథకం తెలంగాణలో విజయం సాధించిన తర్వాత, దేశమంతా దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేయాలని కేంద్రంపై వత్తిడి తెస్తాం. దళితులు వృథా ఖర్చులు చేస్తారనే అపోహను పటాపంచలు చేసి, దళితులు కూడా అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకుంటారని, దళితబంధు పథకాన్ని విజయవంతం చేసి నిరూపిద్దాం. హుజూరాబాద్ లో విజయం సాధించి దేశ దళితజాతి ఆర్థికాభివృద్ధికి దారులు వేద్దాం. దళితజాతి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుదాం.’’
హుజూరాబాద్ దేశానికే దిక్సూచి కావాలి : సీపీఐ రాష్ట్ర శ్రీ నేత బాల నర్సింహా
——————————————————————
‘‘ఇన్నాళ్లూ గత పాలకులు, అరకొర నిధులతో దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు.. వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయలేదు, పైగా దళితులకు ప్రభుత్వాలు ఏవో చేస్తున్నాయనీ, వారే సరిగ్గా వినియోగించుకోవడం లేదని దళితుల పట్ల అపోహలను పెంచాయి. రాజకీయాలకు అతీతంగా ఒక్కో దళిత కుటుంబం బాగుపడేందుకు.. ఎక్కువ మొత్తంలో పది లక్షల రూపాయల ఆర్థికసాయం అందిస్తూ సీఎం కెసిఆర్ అమలు పరుస్తున్న గొప్ప పథకం దళితబంధు. ఈ పథకం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు దారులు వేస్తుంది. దేశవ్యాప్తంగా దళితబంధు వంటి పథకం అమలు కోసం పోరాడుతాం. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాకపోతే.. దాని ప్రభావం తెలంగాణ మీదే దేశం మీద పడుతుంది. కాబట్టి దళితులు పట్టుదలతో వొక యజ్ఞంలాగా భావించి, ఈ పథకం అమలుకోసం కృషిచేయాలి. హుజూరాబాద్ దేశానికే దిక్సూచి కావాలి. దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పాటుబడుతున్న సీఎం శ్రీ కేసీఆర్ కు ధన్యవాదాలు.’’
మధ్యాహ్న భోజనానంతరం ఇంటరాక్టివ్ సెషన్ లో
———————————————
దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళితబంధు పథకం అమలుతోపాటు, దళిత వాడల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని దళితుల స్వాధీనంలో వున్న గ్రామ కంఠాల భూముల వివరాల జాబితా తయారు చేయాలని, దళితులకే హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
హుజూరాబాద్ లో వారం, పదిరోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ భూముల సమస్యలు సహా దళితులకు సంబంధించిన అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని, దళిత ప్రజల డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్ ఆఫీసుకు పిలిపించుకొని పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ శ్రీ కర్ణన్ ను సీఎం ఆదేశించారు. దళితవాడల స్థితిగతులను తెలియజేసే విధంగా ప్రొఫైల్ తయారు చేయాలని ఆదేశించారు.
‘‘హుజూరాబాద్ లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు. వందకు వందశాతం అందరికీ ఇళ్ల సమస్య పూర్తి కావాలి. హుజూరాబాద్ లో ఖాళీ జాగలు వున్న వారికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తది. తెలంగాణ వ్యాప్తంగా దళితులందరికీ దశల వారీగా దీన్ని అమలు చేస్తాం. హుజూరాబాద్ నియోజకవర్గ దళిత వాడల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. నివేదిక తయారు చేసి అధికారులకు అందజేస్తే వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుంది. అలాగే, రేషన్ కార్డులు, పింఛన్లు సహా అన్నిరకాల సమస్యలను, గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలి’’ అని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు సీఎం సూచించారు.
తెలంగాణలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టే, దళిత బంధు పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
దళిత బంధు పథకంలో ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులుంటే సూచించాలని ప్రతినిధులను కోరిన సీఎం వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని వారిని అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకంపై మీ కుటుంబ సభ్యులు ఏమని చర్చించుకుంటున్నారు? అని ముఖ్యమంత్రి వారిని ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం తెలంగాణ దళితుల పాలిటి వరం.. అని సీఎం శ్రీ కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
‘‘దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందే అర్హులకు గుర్తింపు కార్డులను అందిస్తాం. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడెంటిటీ కార్డుల్లో చేర్చి పథకం అమలు తీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటం. లబ్ధిదారుడు తాను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప, ఎవరినీ జారి పడనివ్వం.’’ అని సీఎం భరోసానిచ్చారు.
సదస్సులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలు తెలిపారు:
————————————————————–
దళితులు అభివృద్ధి చెంది, పది మందికి ఆదర్శంగా నిలవాలి: ఎమ్మెల్సీ శ్రీ గోరేటి వెంకన్న, కవి, గాయకుడు.
“చిన్న లోన్ కోసం తన్లాడిన దళితులకు దళిత బంధు ద్వారా ఉపాధి కోసం పది లక్షల రూపాయలు పూర్తి ఉచితంగా ఇవ్వడం సీఎం శ్రీ కేసీఆర్ గొప్ప మానవీయ నిర్ణయం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తర్వాత దళితుల గురించి ఆలోచన చేసిన ఘనత సీఎం శ్రీ కేఈఆర్ గారిదే. ఇది దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది. ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో మాలాంటి వాళ్ళను ప్రజా ప్రతినిధులను చేసి, భాగస్వామ్యం చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
సీఎం అందించే ఆర్థిక సాయం ద్వారా, అణచివేతకు గురైన దళితజాతి తాము అభివృద్ధి చెంది, పది మందికి ఆదర్శంగా నిలిచి, సంస్కారవంతమైన జాతిగా మారినప్పుడే, వివక్షను అధిగమించి ఆర్థిక సామాజిక ఆత్మగౌరవంతో నిలిచినప్పుడే, దళితులందరం సీఎం గారికి నిజమైన కృతజ్ఞతను తెలిపిన వాళ్ళమైతం “దళిత బంధు పథకం‘‘ దళితుల జీవితాల్లో మౌలిక మార్పుకు శ్రీకారం చుట్టాలె. సామాజిక సమరసతకు దారులు అదివేయాలె.. వివక్షతల అంతానికి చరమగీతం పాడాలె.. వెలివాడల వాకిల్లిలో వెన్నెల్లే కురువాలె ’’ అంటూ సదస్సులో కవి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కవితాత్మక సందేశం వినిపించారు.
పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేసే బాధ్యత హుజూరాబాద్ ప్రతినిధులదే – శ్రీ రసమయి బాలకిషన్
‘‘దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకోని తిరుగుతారు. అణగారిన జీవితాల్లో వెలుగులు నింపే సాహసోపేత పథకం తెచ్చినందుకు దళిత జాతి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్న. ఇప్పటికే విదేశీ విద్యను దళితులకు అందించిన ఘనత సీఎం శ్రీ కేసీఆర్ కు మాత్రమే దక్కుతుంది. అరవై లక్షల తెలంగాణ జీవితాలల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉన్నది’’ అని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
మాకూ పాల్గొనే అవకాశం కల్పించండి – శ్రీ గువ్వల బాలరాజు
———————————————————
అద్భుతమైన స్కీం. ఈ ఆలోచన రావడమే గొప్ప మీకు జాతి రుణపడి ఉంటది. పథకం పటిష్ట అమలు కోసం నోడల్ ఏజెన్సీని నియమించాలి. దళిత ప్రజా ప్రతినిధులను పైలట్ నియోజక వర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తే నేర్చుకుంటం. రేపటినాడు మా నియెజకవర్గాల్లో అమలుకు మార్గం సులువవుతుందని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
సీఎం ఏ పథకం పెట్టినా సక్సెస్సే: మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి
————————————————————————–
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఏ పథకం పెట్టినా విజయవంతం అవుతది. రైతుబంధును ఆదర్శంగా తీసుకొని కేంద్రం దేశవ్యాప్తంగా రైతులకు కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటీ లేకుండా నేరుగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే’’ నని కడియం శ్రీహరి తెలిపారు.
భోజన విరామానంతరం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులతో, దళిత బంధు పథకంపై ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం పలువురితో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పథకం పట్ల అమలు పర్యవేక్షణ తదితర అంశాలమీద వారితో చర్చించారు.
‘‘నేను ట్రాక్టర్ డ్రైవర్ ను దళిత బంధుతో ఓనర్ ను అవుతా: శ్రీ సమ్మయ్య
—————————————————————-
“దళిత బంధు పథకంలో ముందుగా అర్హత పొందుతా. నాకు ఆర్థిక సాయం అందితే.. ట్రాక్టర్ డ్రైవర్ ను అయిన నేను ట్రాక్టర్ ను కొనుక్కొని స్వయంగా నడుపుకుంట” అని వీణవంక మండలం కిష్టంపేట గ్రామ నివాసి కల్లెపల్లి సమ్మయ్య ముఖ్యమంత్రితో అన్నారు.
దళితబంధుతో టాక్సీ కొనుక్కుంటా: శ్రీ చిరంజీవి
——————————————–
“కార్ డ్రైవర్ అయిన తాను టాక్సీ మారుతి స్విఫ్ట్ డిజైర్ కొనుక్కొని స్వయంగా కిరాయిలకు తిప్పుకుంట’’ అని వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామవాసి దాసారపు చిరంజీవి సీఎం శ్రీ కేసీఆర్ కు తెలిపారు. వీరి స్వయం నిర్ణయాధికారం గొప్పదన్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
మెడికల్ షాపు పెట్టుకుంటా: శ్రీమతి దరిపల్లి తిరుమల, మామిడాలపల్లి
———————————————————–
‘‘మా దళిత కాలనీ.. మా ఊరు మామిడాలపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటది. అందుకే మా కాలనీలో మెడికల్, జనరల్ స్టోర్స్ షాపు పెట్టుకుంటా.’’ అని తెలపడంతో సీఎం శ్రీ కేసీఆర్ ఆమెను అభినందించారు.
నా భర్త డోజర్ నడుపుతడు.. డోజర్ కొనుక్కుంటం: శ్రీమతి శారద, మల్లారెడ్డిపల్లి
———————————————————————–
‘‘నా భర్తకు డోజర్ నడుపొస్తది. ఇపుడు మేం దళిత బంధు పథకంతో ట్రాక్టర్ డోజర్ కొనుక్కుంటం. దీంతో మా బతుకుకు భరోసా ఏర్పడుతది.’’ అని చెప్పడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
డెయిరీ ఫామ్ పెట్టుకుంటం: శ్రీ తాండ శంకర్, చల్లూరు
————————————————–
‘‘నాకు పాల డెయిరీ మీద అవగాహన ఉన్నది. నేను బర్లు కొనుక్కొని డెయిరీ ఫాం పెట్టుకుందామని అనుకుంటున్న. దళిత బంధు పథకంతో నా కల నెరవేరుతది.’’ అన్నారు.
ఫెర్టిలైజర్ లేదా కిరాణం షాపు పెట్టుకుంట: శ్రీ హరీశ్, శ్రీరాములపేట
————————————————————-
‘‘ఆసరా లేని వాళ్లకు దళితబంధు పథకం చాలా బాగా ఉపయోగ పడుతది. నేను ఫెర్టిలైజర్ లేదా కిరాణం షాపు పెట్టుకుంట’’ అన్నారు.
➧ ఇంతకాలం మాకెవరూ ఇలాంటి పథకాలు చెప్పలేదు, మా కొడుకు, కోడలు మెడికల్ షాపు పెడదామనుకుంటున్నరు: శ్రీ సారయ్య, రిటైర్డు టీచర్, హుజూరాబాద్.
➧ సెంట్రింగ్ ప్లేట్లతో వ్యాపారం చేసుకుంటా: శ్రీ దాసారపు గురువయ్య, నర్సింగాపూర్
➧ పాడి గేదెలతో డెయిరీ ఫాం పెట్టుకుంటా: శ్రీ స్టీఫెన్, ఎల్బాక గ్రామం
➧ లైటింగ్ డెకరేషన్ వ్యాపారం పెట్టుకుంటా: శ్రీ రాకేశ్ కుమార్, ఇల్లంతకుంట (గ్రా, మం)
➧ నేను పౌల్ట్రీ ఫాం పెట్టుకుంటా: శ్రీ మాదాసు మహేందర్, గడ్డివాని పల్లి
➧ ట్రాక్టర్ కొనుక్కుంటం: శ్రీమతి కమల, ఇల్లంతకుంట (గ్రామం, మండలం)
➧ మినీ సూపర్ మార్కెట్ పెట్టుకుంటా: శ్రీ సురేందర్, బోజనూరు
➧ వరికోతల హార్వెస్టర్ మిషన్ కొనుక్కొంటా: శ్రీ నరేష్, శంభునిపల్లి, జమ్మికుంట మండలం
➧ నాటుకోళ్లు, కడక్ నాథ్ కోళ్లు పెంచి, అమ్మే వ్యాపారం పెట్టుకుంటా: శ్రీ సారంగం, మడిపల్లి
➧ పండ్ల వ్యాపారం పెట్టుకుంటా: శ్రీ ఎల్కపల్లి దేవేందర్, శాలవాడ, జమ్మికుంట పట్టణం.
➧ ఆటో మొబైల్స్ షాపు పెట్టుకుందామనుకుంటున్నా: శ్రీ తేజ, జమ్మికుంట పట్టణం
➧ జిరాక్సు, కంప్యూటర్ డీటీపీ, ఇంటర్నెట్ షాపు పెట్టుకుంటా: శ్రీ రమేశ్, జమ్మికుంట
తెలంగాణ దళిత బంధు పథకం అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వివిధ రంగాలను ఉదహరిస్తూ సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను (Illustrative list) ఎస్సీ సంక్షేమ శాఖ రూపొందించి సదస్సులోని ప్రతినిధులకు అందించింది.
అందులో గ్రామీణ, ఉప పట్టణ, పట్టణ ప్రాంతాల్లో ఎంచుకునేందుకు అనువైన వ్యాపార, ఉపాధి, రంగాలను గుర్తించింది. వాటి వివరాలు.
దళిత బంధు పథకంలో భాగంగా ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా:
———————————————————–
➧ రూరల్ (గ్రామీణ) ప్రాంతాల్లో.. మినీ డెయిరీ యూనిట్, పందిరి కూరగాయల సాగు, వరినాటు యంత్రాలతోపాటు పవర్ టిల్లర్, వేపనూనె, పిండి తయారీ, ఆటో ట్రాలీ పథకాలున్నాయి.
➧ రూరల్ (గ్రామీణ), ఉప పట్టణ (సబ్ అర్బన్) ప్రాంతాల్లో.. వ్యవసాయ సాగు కొరకు యంత్ర పరికరాల సేల్స్, మట్టి ఇటుకల తయారీతోపాటు ఆటో ట్రాలీ, ట్రాక్టర్ మరియు ట్రాలీ, కోళ్ల పెంపకంతో పాటు ఆటో ట్రాలీ (సుగుణ, వెంకోబ్ ఫ్రాంచైసీ) పథకాలున్నాయి.
➧ రూరల్ (గ్రామీణ), సబ్ అర్బన్ (ఉప పట్టణ), అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో.. సెవన్ సీటర్ ఆటో, ప్యాసింజర్ ఆటో రిక్షా, త్రీ వీలర్ ఆటో ట్రాలీ, విత్తనాలు/ఎరువుల, క్రిమిసంహారక మందుల దుకాణం (ప్రభుత్వ అనుమతితో), టెంట్ హౌస్ తో సహా డెకొరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ తోపాటు, ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం మరియు వ్యాపారం, ఆయిల్ మిల్, పసుపు, కారం, బియ్యం, పిండి గిర్నీల పథకాలున్నాయి.
➧ సబ్ అర్బన్ ( ఉప పట్టణ), అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో.. ప్రయాణీకులు/సరుకుల రవాణాకు నాలుగు చక్రాల వాహనం, ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్, డయాగ్నస్టిక్ ల్యాబ్ మరియు మెడికల్ షాప్, ఎలక్ట్రికల్ షాప్, బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్, హార్డ్ వేర్ సానిటరీ షాప్ తోపాటు ఆటో, సిమెంట్ ఇటుకలు/ రింగుల తయారీ ప్రి కాస్టింగ్ స్ట్రక్చర్ తోపాటు ఆటో ట్రాలీ, సెంట్రింగ్/ఆర్.సి.సి. రూఫ్ మేకింగ్ (స్టీల్, వుడెన్), కాంక్రీట్ రెడీ మిక్స్ తయారీ యంత్రం, అకృలిక్ షీట్స్, టైల్స్ వ్యాపారంతోపాటు ఆటో ట్రాలీ పథకాలున్నాయి.
హోటల్, క్యాటరింగ్ (ధాబా)తోపాటు ఆటో ట్రాలీ, ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్ తో పాటు ఆటో ట్రాలీ, మెడికల్ – జనరల్ స్టోర్స్ (ప్రభుత్వ అనుమతితో), మినీ సూపర్ బజార్, డీటీపీ, మీసేవ, సీఎస్సీ ఆన్ లైన్ సర్వీస్, ఫొటో స్టుడియో, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్/హార్డ్ వేర్, మార్బుల్, పాలిషింగ్ / గ్రానైట్ కటింగ్ / పీఓపీ, ఫుడ్ రెస్టారెంట్, సిమెంట్ / స్టీల్ దుకాణం (సబ్ డీలర్ షిప్), పశువులు, కోళ్ల దాణా తయారీ కేంద్రంతో పాటు ఆటో ట్రాలీ, చెప్పులు/లెదర్ గూడ్స్ షాపు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డ్రోన్ కెమెరా (అన్ని ఫంక్షన్ల కోసం), ప్రభుత్వ అనుమతులతో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం 2 ఆటో ట్రాలీలను అందించే పథకాలున్నాయి.
➧ పట్టణ (అర్బన్) ప్రాంతాల్లో.. మొబైల్ టిఫిన్ సెంటర్ (4 వీలర్స్), క్లాత్ ఎంపోరియం – టెక్స్ టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ షోరూం, పేపర్ ప్లేట్స్/గ్లాసెస్, బ్యాగ్స్, తయారీ యూనిట్ (ఆటో ట్రాలీతో కలిపి), కార్ టాక్సీ (క్యాబ్), ఎంబ్రాయిడరీ, టైలరింగ్, లేడీస్ ఎంపోరియం, కిచెన్ వేర్ – ఫర్నీచర్ షాప్ (సేల్స్, సర్వీస్), ఫ్లెక్సీ, వినైల్ డిజిటల్ ప్రింటింగ్ (ఆటో ట్రాలీతో కలిపి), డిజిటల్ ఫొటో స్టుడియో – ల్యాబ్, ఆటో మొబైల్ షాప్-సర్వీసింగ్ యూనిట్, డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, పేపర్ న్యాప్కిన్స్ సేల్స్ షాపు మొదలైన పథకాలున్నాయి.
సదస్సు హై లైట్స్:
——————
• దళితబంధు అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా సాగింది.
• ఈ పథకం కింద ఏం పెట్టుకుంటే బాగుంటుందని పలువురు ప్రతినిధులు సదస్సుకు ముందే తమ కుటుంబాలతో చర్చించుకొని వచ్చినట్లుగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు చెప్పడంతో సీఎం సంతోషించారు.
• సదస్సులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు పలు సందేహాలను సీఎం శ్రీ కేసీఆర్ ను అడిగి నివృత్తి చేసుకున్నారు.
• భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.. సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.
• ఘుమఘుమలాడే మాంసాహార, భోజనాలను సుమారు 500 మందికి వడ్డించారు.
• వారి వారి భవిష్యత్ రంగాల్లో చర్చించుకోవడం సీఎం కేసీఆర్ ను ఆకర్శించింది.
• ప్రతి ఒక్కరిలో ఒక పులిలాంటి శక్తి దాగి ఉంటుందని, గొర్రెల మందలో పెరిగిన పులి కథను సీఎం చెప్పారు. ఈ సందర్భంగా సభలో నవ్వులు వెల్లి విరిసాయి.
• పైరవీకారుల మీద రామాయణం’ కథ చెప్పిన సీఎం.. వారిని దూరం పెట్టాలనడంతో సభలో నవ్వులు విరిశాయి.
• 17 వేల పొదుపు సంఘాలను తయారు చేసిన బంగ్లాదేశ్ కు చెందిన ప్రొఫెసర్ హాష్మీ విజయగాథను చెప్పినపుడు సభికులు ఎంతో స్ఫూర్తితో ఉత్తేజితులయ్యారు.
• సదస్సులో సీఎం సలహాలు, సూచనలతో ప్రతినిధులు, అధికారులు ఉత్తేజం పొందారు.
• పలు సమస్యలను ప్రతినిధులు ప్రస్తావించగా, వాటిని పరిష్కరించాలని సీఎం అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలిచ్చారు.
• పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును హుజూరాబాద్ లో విజయవంతం చేస్తామని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు విశ్వాసం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here