టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం…

  80
  0
  trs party

  టీఆర్ఎస్ పార్టీ క‌రెక్ష‌న్ చేసే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. ఏడేళ్ల నుంచి ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కిందిస్థాయి నేత‌ల్లో నైరాశ్యం అలుముకుంది. కార్య‌క‌ర్త‌ల క‌ష్ట‌సుఖాల‌ను తెలుసుకునేవారు క‌రువ‌య్యారు. దీనిని గ‌మ‌నించిన అధినాయ‌క‌త్వం దిద్దుబాటుకు శ్రీ‌కారం చుట్టింది. ఓ వైపు ప్లీన‌రీ, విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌కు స‌న్నాహ‌క స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తూనే మండ‌ల స్థాయి నేత‌ల‌తో మంత్రి కేటీఆర్ ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. పార్టీ ఎలా ఉంది? మ‌రింత ప‌టిష్ట‌త‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి? అనే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. 2001లో తెలంగాణ సాధ‌నే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్ఎస్‌కు ప్ర‌స్తుతం రాష్ట్రంలో 60ల‌క్ష‌ల మంది స‌భ్యులున్నారు. అయిన‌ప్ప‌టికీ గ్రామ‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య కొంత గ్యాప్ ఉంది.

  కింది స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వ‌ర‌కు 90% ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్న‌ప్ప‌టికీ గ్రామ‌స్థాయిలో ప‌టిష్టంగా లేదు. ప్ర‌జాప్ర‌తినిధులు కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రాష్ట్రంలో అక్క‌డ‌క్క‌డ నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డం, టీఆర్ఎస్ నుంచి ఇత‌ర పార్టీల‌కు వెళ్తుండ‌టం ప‌రిపాటిగా మారింది. మ‌రో ప‌క్క పార్టీ బ‌ద్నాం అవుతుండ‌టంతో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. పార్టీ స్థాపించి 20ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో వ‌చ్చే నెల 15న విజ‌య‌గ‌ర్జ‌న స‌భ నిర్వ‌హిస్తున్న‌ది. విజ‌య గ‌ర్జ‌న కోసం ఈ నెల 18నుంచి ప్ర‌తిరోజు 20నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు సుమారు 400మందితో పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ స‌మావేశ‌మ‌వుతున్నారు.

  ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి సుమారు అర్ధ‌గంట స‌మ‌యం కేటాయిస్తూ మండ‌ల పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతున్నారు. అలాగే పార్టీ సంస్థాగ‌త ప‌రిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. మండ‌లంలో ఉన్న స‌మ‌స్య‌లు, గ్రూపుల‌పై ఆరా తీస్తున్నారు. మండ‌ల నాయ‌కులు కేటీఆర్‌తో పార్టీలో చిన్న‌చూపు చూస్తున్నార‌ని, త‌మ‌కు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నివేదిస్తున్నట్లు స‌మాచారం. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ల‌బ్ధిదారుల ఖాతాలో నేరుగా వేయ‌కుండా మండ‌ల స్థాయి నేత‌ల‌తో ఇప్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌మ‌కు గుర్తింపు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు తెలిసింది. కేవ‌లం ఎమ్మెల్యేలు మాత్ర‌మే క‌ల్యాణ‌ల‌క్ష్మి, త‌దిత‌ర ప‌థ‌కాల‌కు సంబంధించిన చెక్కులు అంద‌జేస్తున్నార‌ని, త‌మ‌కు కొన్ని ఇచ్చేలా చూడాల‌ని విన్న‌వించుకుంటున్నారు.

  ఇలా త‌మ‌కు అవ‌కాశం క‌ల్పిస్తే ప్ర‌జ‌ల్లో త‌మ‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని, త‌ద్వారా పార్టీ బ‌లోపేతం అయ్యే అవ‌కాశం ఉంటుందని ప‌లువురు చెప్పిన‌ట్టు స‌మాచారం. కేటీఆర్ మాత్రం ప్ర‌తి అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఎమ్మెల్యేలు, మండ‌ల స్థాయి ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు అందుబాటులో ఉండాల‌ని, వారి స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌ని సూచిస్తున్న‌ట్టు తెలిసింది. పార్టీ గ్రూపుల‌పై త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, అంద‌రినీ క‌లుపుకుని పోయేలా చ‌ర్య‌లుంటాయ‌ని, గ్రామ‌స్థాయి నుంచి పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటామ‌ని వారికి కేటీఆర్ మాట ఇస్తున్నారు. టీఆర్ఎస్ అంటేనే గ్రూపుల‌కు అతీత‌మ‌నే విధంగా తీర్చిదిద్దుదామ‌ని పార్టీ నేత‌ల‌కు కేటీఆర్ భ‌రోసా ఇస్తున్న‌ట్టు మండ‌ల నాయ‌కులు పేర్కొన్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here